సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో, మణుగూరు ఏరియా కాంట్రాక్ట్ కార్మికులు తమ వేతన పెంపు మరియు ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి. జనక్ ప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు. "మిమ్ములనే నమ్ముకున్నాం, న్యాయం చేయండయ్యా" అంటూ కార్మికులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వరి సహకారంతో, జనక్ ప్రసాద్ కు వినతిపత్రం సమర్పించిన సందర్భంగా, యూనియన్ మణుగూరు ఏరియా అధ్యక్షులు అంగోత్ మంగీలాల్ మాట్లాడుతూ, సింగరేణి వ్యాప్తంగా సుమారు 32,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు వివిధ విభాగాలలో పనిచేస్తున్నారని తెలిపారు. వీరంతా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి, వారి అభ్యర్థులను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. అయితే, కాంట్రాక్ట్ కార్మికులు తక్కువ వేతనాలతో జీవనం సాగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ గా జనక్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో, తమకు న్యాయం జరుగుతుందని కార్మికులు ఆశిస్తున్నట్లు మంగీలాల్ తెలిపారు. 22వ నంబర్ జీవో లేదా హై పవర్ కమిటీ వేతనాలను అమలు చేయాలని, ఆ దిశగా తగు చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా, అనేక ఇతర సమస్యల పరిష్కారానికి కూడా చొరవ చూపాలని కోరారు.
సంక్షేమ పథకాలలో భాగంగా ఈఎస్ఐ వైద్యం తక్షణమే అమలు చేయాలని, సిఎంపిఎఫ్ పర్మినెంట్ కార్మికులకు మాదిరిగా ఆన్లైన్ సేవలను అమలు చేయాలని, సింగరేణి క్యాంటీన్లలో టీ, టిఫిన్ లకు బడ్జెట్ కేటాయించాలని, పని భద్రత కల్పించాలని కూడా కార్మికులు విజ్ఞప్తి చేశారు. మణుగూరు ఏరియా సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు కూడా ఖాకీ యూనిఫామ్ అమలు చేయాలని, నర్సరీ కాంట్రాక్ట్ కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు చెల్లించి, పిఎఫ్ అమలు చేయాలని కోరారు.

