నకిలీ పత్రాలను సృష్టించి, అమాయకులను మోసం చేస్తూ ప్లాట్లను విక్రయిస్తున్న అంతర్ జిల్లా ముఠాను వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ఏడుగురు అదుపులోకి రాగా, ఒకరు పరారీలో ఉన్నారు.
వనస్థలిపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వల్లాల ప్రేమ్ కుమార్, కోట్ల నాగేంద్ర ప్రసాద్, ఎల్మటి సుకుమార్ రెడ్డి అనే ముగ్గురు పాత నేరస్థులు సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మునుగనూరు గ్రామంలోని ఒక ప్లాట్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.
వారు 1987 నాటి సేల్ డీడ్‌ను ఫోర్జరీ చేసి, నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు, లీగల్ హెయిర్ సర్టిఫికెట్లను సృష్టించారు. ఈ నకిలీ పత్రాల ఆధారంగా, కొంతమంది మహిళలను యజమానుల వారసులుగా చిత్రీకరించి, బాధితుడికి ప్లాట్‌ను విక్రయించి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి, శాస్త్రీయ దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఐదు స్మార్ట్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, నకిలీ సేల్ డీడ్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో పలువురిపై గతంలోనే కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో వల్లాల ప్రేమ్ కుమార్ (10 కేసులు), కోట్ల నాగేంద్ర ప్రసాద్ (8 కేసులు), ఎల్మటి సుకుమార్ రెడ్డి (3 కేసులు)తో పాటు ఇందుర్తి కృష్ణ రెడ్డి, ముప్పాళ్ల సుజాత, నలవల్లి బాలమణి, తలారి సులోచనలను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు సూర్య పరారీలో ఉన్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది.

