కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ను ఢిల్లీలో కలిసి, కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB) ల నిర్మాణం వంటి కీలక అంశాలపై చర్చించారు. మంత్రి సానుకూల స్పందన తెలిపినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ABSS) కింద కామారెడ్డి రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలని, దీనికోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు. పాత రైల్వే క్వార్టర్స్ ను తొలగించి, వివేకానంద కాలనీ వైపు కొత్త భవనాలను నిర్మించాలని, అలాగే స్టేషన్ రోడ్ వైపు ఉన్న రైల్వే భవనాలను కూడా తరలించాలని విజ్ఞప్తి చేశారు.
నూతన రైల్వే భవనం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాల ప్లాన్స్ సిద్ధంగా ఉన్నాయని, వీటికి సంబంధించి మంత్రి నుండి సానుకూల స్పందన లభించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. త్వరలోనే నిధులు కేటాయించి, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి స్వయంగా తెలిపారని ఆయన తెలిపారు.
జిల్లా కేంద్రంలో మూడు చోట్ల రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB) ల ఏర్పాటుకు సంబంధించి, స్థల పరిశీలన, జాయింట్ ఇన్స్పెక్షన్, సాయిల్ టెస్టింగ్ వంటి ప్రక్రియలను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పనులు ప్రారంభమై, రెండేళ్లలోపు పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.


