భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా సిద్దిపేట జిల్లాకు చెందిన కప్పర ప్రసాద్ రావును పార్టీ అధిష్ఠానం నియమించింది. పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత, క్షేత్రస్థాయిలో చేసిన కృషిని గుర్తించి ఈ కీలక బాధ్యతను అప్పగించారు.
కప్పర ప్రసాద్ రావు విద్యార్థి దశ నుంచే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొని, బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. అనంతరం జర్నలిజం రంగంలో పలు పత్రికలు, టెలివిజన్ ఛానళ్లలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 'ఈనాడు', 'వార్త', 'సూర్య' పత్రికలతో పాటు టీవీ5, హెచ్ఎంటీవీ, రాజ్ న్యూస్‌లలో ఆయన పనిచేశారు. ప్రస్తుతం 'జర్నలిస్ట్ టీవీ' సీఈవోగా కొనసాగుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ, తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటంలోనూ ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. రాజకీయంగా పార్టీ ఇచ్చిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ, బీజేపీలో విశ్వసనీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. బీజేపీ మానవ హక్కుల విభాగం రాష్ట్ర కన్వీనర్‌గా కూడా ఆయన సేవలందించారు.
అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించడంతో పాటు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. గతంలో బండారు దత్తాత్రేయ, జి. కిషన్ రెడ్డి, డాక్టర్ కె. లక్ష్మణ్, బండి సంజయ్ కుమార్ వంటి రాష్ట్ర అధ్యక్షుల హయాంలోనూ, ప్రస్తుత అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావుతోనూ ఆయన సన్నిహితంగా పనిచేసిన అనుభవం ఉంది.
తిగుల్ గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి కీలక బాధ్యతలు అందుకోవడం పట్ల స్థానికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నియామకం పార్టీ కార్యకలాపాలకు మరింత ఊతమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

