ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద పంపిణీ కాకుండా మిగిలిపోయిన నిధులను ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో పారదర్శకతను పెంచే దిశగా జారీ అయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం నెలకు సుమారు 62.76 లక్షల మంది పెన్షనర్ల కోసం ₹2,725.79 కోట్లు విడుదల చేస్తోంది. అయితే, పెన్షన్ పంపిణీ ముగిసిన రెండు పని దినాలలోపు పంపిణీ కాని మొత్తాన్ని చలాన్ ద్వారా ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని నిబంధన విధించింది. ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
గతంలో పేరుకుపోయిన నిధులపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి 2025-26 వరకు పేరుకుపోయిన పాత అన్-స్పెంట్ (Unspent) నిధులను కూడా వెంటనే వెనక్కి పంపాలని స్పష్టం చేసింది. ఈ పాత నిధులను మార్చి 13, 2026 లోపు ఖచ్చితంగా ప్రభుత్వానికి జమ చేయాలని గడువు నిర్దేశించింది.
నిర్దేశించిన సమయంలోగా నిధులు జమ చేయడంలో విఫలమైతే, సంబంధిత సిబ్బంది మరియు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాల అమలును SERP సీఈఓ అత్యవసరంగా పరిగణించాలని సూచించారు. దీనిపై SERP సీఈఓ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.

