రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో రవాణా శాఖ, R&B శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన “అరైవ్-అలైవ్” కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా, ఏప్రిల్ 13 నుండి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ కార్యక్రమాల విజయానికి ప్రజల భాగస్వామ్యం అత్యవసరమని ఆయన నొక్కి చెప్పారు. రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని, భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తాయని ఆయన అన్నారు. చిన్నతనం నుంచే రోడ్డు భద్రతను పాఠ్యాంశంగా చేర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రమాదాలకు కారణమయ్యే 'బ్లాక్ స్పాట్స్' ను గుర్తించి, వాటి నివారణకు తక్షణ చర్యలు చేపడుతున్నామని మంత్రి ప్రభాకర్ తెలిపారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి సహాయం చేసేవారికి ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా "అరైవ్-అలైవ్", "రహ-వీర్" వంటి రోడ్డు భద్రత నిబంధనలకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.
మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, దేశంలో ఏటా సుమారు 1.8 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, ఇది ఆందోళనకరమని అన్నారు. ప్రమాద సమయంలో బాధితులకు సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన సూచించారు. రోడ్డు నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణమని, దీనిపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అన్నారు. టీజీఎస్ఆర్టీసీ దేశంలో మూడవ అతిపెద్ద రవాణా సంస్థగా ఉందని, రోజుకు 6 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తోందని సంస్థ ఎండీ నాగిరెడ్డి తెలిపారు.
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి జాతీయ రహదారులపై ప్రమాదాలను తగ్గించడానికి హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలని కోరారు. ఐఐటీ విద్యార్థుల ఆవిష్కరణలను రోడ్డు భద్రతలో ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జిల్లాలో రోడ్డు భద్రతకు తీసుకుంటున్న చర్యలను వివరించి, జిల్లాను ప్రమాద రహితంగా తీర్చిదిద్దడంలో అందరి సహకారాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.












