హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు అక్రమంగా తరలిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎఫ్) బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. సుమారు రూ.9 లక్షల విలువైన 285-290 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సోమవారం జాతీయ రహదారి-44పై వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో టాస్క్ ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం ఈ అక్రమ రవాణాను అడ్డుకుంది. ముందస్తు సమాచారం మేరకు అనుమానాస్పదంగా కనిపించిన లారీని ఆపి తనిఖీ చేయగా, అందులో భారీగా పీడీఎఫ్ బియ్యం తరలిస్తున్నట్లు తేలింది.
అధికారులు లారీ నుంచి సుమారు 285-290 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.9 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ వ్యవహారం వెనుక హైదరాబాద్కు చెందిన నాగరాజు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
లారీ డ్రైవర్ అసదుల్లా ఆలంను అదుపులోకి తీసుకున్న అధికారులు, లారీని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పంచనామా నిర్వహించి ఎఫ్సీఐ గోదాంలకు తరలించారు. ఈ దాడుల్లో భిక్కనూరు ఎస్ఐ ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.











