తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులకు మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ GO ms నం. 252 ప్రకారం ఈ కార్డులను జారీ చేయనున్నట్లు సమాచార & ప్రజా సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ శ్రీమతి సి.హెచ్. ప్రియాంక తెలిపారు.
ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, ఫ్రీలాన్స్ మరియు అనుభవజ్ఞులైన జర్నలిస్టులు ఈ నెల 9వ తేదీ నుండి ipr.telangana.gov.in అనే ప్రత్యేక పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
దరఖాస్తు మరియు కార్డుల జారీ ప్రక్రియ నిరంతరాయంగా (రోలింగ్ ప్రాతిపదికన) కొనసాగుతుందని, దీనివల్ల జర్నలిస్టులకు సౌలభ్యంగా ఉంటుందని పేర్కొన్నారు.
దరఖాస్తు సమయంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే, దరఖాస్తుదారులు కార్యాలయ వేళల్లో (ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 వరకు) 9154170881 నంబర్లో మీడియా రిలేషన్స్ వింగ్‌ను సంప్రదించవచ్చని కమీషనర్ తెలియజేశారు.


