సిద్దిపేట జిల్లా ములుగులో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి కప్పర ప్రసాద్ రావు మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలంటే సమాజంలో వంద శాతం అక్షరాస్యత సాధించాలని, అప్పుడే సమానత్వం, న్యాయం, సామాజిక అభివృద్ధి సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
ములుగులో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కప్పర ప్రసాద్ రావు, అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విద్య ద్వారానే సామాజికంగా వెనుకబడిన వర్గాలు అభివృద్ధి చెందుతాయని, ప్రతి కుటుంబం విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలని, ఆయన సిద్ధాంతాలను యువత ఆచరణలో పెట్టాలని కప్పర ప్రసాద్ రావు పిలుపునిచ్చారు. అంబేద్కర్ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించడంలో ప్రతి పౌరుడు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి తూర్పింటి శ్రీను, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.












