భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని రాంపల్లి మరియు నాగారం ప్రాంతాల్లో ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన భారీ ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
డా. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రాంపల్లి-నాగారం ప్రాంతాలు నీలిరంగు జెండాలు, అంబేద్కర్ చిత్రాలతో అలంకరించబడి పండుగ వాతావరణాన్ని తలపించాయి. స్థానిక ప్రజలు, నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.
రాంపల్లి నుండి నాగారం వరకు భారీ ర్యాలీ నిర్వహించబడింది. "జై భీమ్" నినాదాలతో యువత అంబేద్కర్ ఆశయాల పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు. సంప్రదాయ బృందాలు, డప్పు వాద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ర్యాలీకి మరింత రంగును అద్దాయి.
ర్యాలీలో పాల్గొన్న యువ నాయకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ చూపిన సమానత్వ మార్గం సమాజానికి వెలుగుదారి అని, విద్య, సమాన హక్కులు, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఇంట్లో, ప్రతి మనసులో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఇతర వక్తలు మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి బలమైన పునాది వేసిందని, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, మహిళలు, విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











