ఒక కోటి రూపాయల విలువైన ప్లాటును నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రయత్నించిన ఘటన చేవెళ్లలో సోమవారం వెలుగులోకి వచ్చింది. సబ్ రిజిస్ట్రార్ అప్రమత్తతతో నిందితులు పోలీసులకు చిక్కారు.
నగరానికి చెందిన శర్మ 2006లో మొయినాబాద్‌లో ఏర్పాటు చేసిన వెంచర్లో బంజారాహిల్స్‌కు చెందిన అనిల్ దూబే తన భార్య అమృత పేరు మీద 300 గజాల ప్లాట్ కొనుగోలు చేశారు. అయితే, తాహేబ్ మహమ్మద్ అనే వ్యక్తి నకిలీ పత్రాలను సృష్టించి, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకున్నాడు. సోమవారం కార్యాలయంలో పత్రాల పరిశీలన సమయంలో, యజమాని అమృత పేరు పిలవగా, మున్నాబాయ్ అనే మహిళ తడబడటంతో సబ్ రిజిస్ట్రార్‌కు అనుమానం కలిగింది.
సబ్ రిజిస్ట్రార్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఆన్లైన్లో తనిఖీ చేయగా అవి నకిలీవని తేలింది. ఈ క్రమంలో తాహేబ్ మహమ్మద్ పారిపోయేందుకు ప్రయత్నించగా, కార్యాలయ సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతనితో పాటు వచ్చిన మరో మహిళ, మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ సంఘటనతో రియల్ ఎస్టేట్ రంగంలో నకిలీ పత్రాల వ్యవహారాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి మోసాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. ఈ నకిలీ పత్రాల వ్యవహారంలో ఇంకా ఎవరైనా భాగస్వాములు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ పత్రాల సృష్టికర్తలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.











