వై.ఎస్.ఆర్ కడప జిల్లా పులివెందులలో పోలీసులు గంజాయి, నాటు సారా అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి, 18 మందిని అరెస్ట్ చేయడంతో పాటు 15 కిలోల గంజాయి, 110 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ ఈ వివరాలను వెల్లడించారు.
జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు, పులివెందుల SDPO బి.మురళి ఆధ్వర్యంలో పులివెందుల అర్బన్ పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. ఉదయం కదిరి రింగ్ రోడ్ సమీపంలో గంజాయి రవాణా చేస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అదే సమయంలో, పులివెందుల పట్టణంలో నాటు సారా అమ్ముతున్న మరో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 110 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ప్రధాన నిందితుడైన గొర్ల భరత్ యాదవ్కు పాత కేసులు ఉన్నాయని, జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ ఈ వ్యాపారంలోకి దిగాడని ఎస్పీ తెలిపారు.
పట్టుబడ్డ నిందితులను రిమాండ్కు తరలించనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో డ్రగ్స్, నాటు సారా అక్రమాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని ఆయన హెచ్చరించారు. నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.











