తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక ప్రపంచ మేధావి అని, భారత రాజ్యాంగ నిర్మాత అని కొనియాడారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన జయంతిని పురస్కరించుకొని నివాళులర్పించిన అనంతరం వీరస్వామి గౌడ్ మాట్లాడారు. భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు.
దేశంలో అస్పృశ్యత, అంటరానితనానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. చదువుకోవడానికి అవకాశాలు లేని పరిస్థితుల్లోనూ విద్యనభ్యసించి, ఉన్నత చదువులు చదివి ప్రపంచంలోనే గొప్ప మహనీయుడిగా ఎదిగారని తెలిపారు.
అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. యువత అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, నిరక్షరాస్యత లేని దేశ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.











