సంగారెడ్డి, జూలై 16
వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ గురువారం జిన్నారం సర్కిల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ ఆవరణ పరిశుభ్రత, సిబ్బంది బ్యారక్స్, రికార్డుల నిర్వహణను పరిశీలించి, పలు సూచనలు చేశారు. వాహనాల డిస్పోజల్, కేసుల దర్యాప్తు నాణ్యతపై ఆదేశాలు జారీ చేశారు.
వార్షిక తనిఖీలలో భాగంగా గురువారం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ జిన్నారం సర్కిల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా జిన్నారం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, పటాన్చెరు డీఎస్పీతో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు.
అనంతరం స్టేషన్ ఆవరణ పరిశుభ్రత, సిబ్బంది బ్యారక్స్, స్టేషన్ రికార్డుల నిర్వహణను పరిశీలించారు. సిబ్బందికి అందజేసిన కిట్ ఆర్టికల్స్‌ను జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న స్వాధీనపరచుకున్న, కేసులకు సంబంధించిన వాహనాల వివరాలను అడిగి తెలుసుకొని, క్రైమ్ సంబంధించిన వాహనాలను సకాలంలో కోర్టులో డిపాజిట్ చేయాలని, అన్క్లెయిమ్డ్ వాహనాలను బహిరంగ వేలం ద్వారా డిస్పోజ్ చేయాలని ఆదేశించారు.
స్టేషన్ రికార్డులను పరిశీలిస్తూ, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు అండగా నిలవాలని సూచించారు. స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసి, ప్రతి రికార్డును ఆప్డేట్ గా ఉంచాలన్నారు.
విలేజ్ పోలీసు అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, గ్రామ పెద్దలు, యువతతో సమన్వయం కలిగి శాంతిభద్రతలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని సేకరించాలని సూచించారు.
స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ హిస్టరీ షీటర్ల వివరాలను పరిశీలిస్తూ, వారి కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, పగలు, రాత్రి బీట్లలో వారిని తరచూ తనిఖీ చేసి, సంబంధిత వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు.
ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో పరిశ్రమలు ఉండటంతో వలస కార్మికులు (మైగ్రెంట్ లేబర్) ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ఆస్తి సంబంధిత నేరాలు జరిగే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయని పేర్కొన్నారు. ఆస్తి సంబంధిత నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను క్రైమ్ ప్రోన్ ఏరియాలుగా గుర్తించి, బ్లాక్ స్పాట్లుగా అభివృద్ధి చేసి, పగలు-రాత్రి బీట్ విధుల్లో నిఘా మరింత పెంచాలని ఎస్హెచ్ఓకు సూచించారు.
నేరాల నియంత్రణ, నేరాల ఛేదనలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించి, స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.











