కామారెడ్డి, 2026-07-11
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 16 కార్పొరేషన్లలో రెడ్డి కార్పొరేషన్‌ను చేర్చడం స్వాగతించదగినదే అయినప్పటికీ, ఇప్పటివరకు చైర్మన్, పాలకవర్గాన్ని నియమించకపోవడంపై రాష్ట్ర రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షుడు నాగర్తి చంద్రారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో నూతన మండల కమిటీ ఎన్నిక సందర్భంగా ఆయన ఈ డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 16 కార్పొరేషన్లలో రెడ్డి కార్పొరేషన్‌ను చేర్చడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఇప్పటివరకు కార్పొరేషన్‌కు చైర్మన్, పాలకవర్గాన్ని నియమించకపోవడం సమంజసం కాదని రాష్ట్ర రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షుడు నాగర్తి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని రెడ్డి సంఘ భవనంలో రాష్ట్ర అధ్యక్షులు నాగర్తి చంద్రారెడ్డి, జిల్లా కమిటీ పెద్దల ఆధ్వర్యంలో రెడ్డి ఐక్యవేదిక నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సంఘ సభ్యులు రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులకు శాలువాతో ఘనంగా సన్మానించారు. నూతనంగా ఎన్నుకున్న సదాశివనగర్ నూతన పాలకవర్గాన్ని కూడా సంఘ సభ్యులు సన్మానించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రెడ్డి సంఘాల అధ్యక్షులు నాగర్తి చంద్రారెడ్డి మాట్లాడుతూ, కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి కుటుంబాలకు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. విద్య, వైద్యం, ఉపాధి, స్వయం ఉపాధి కోసం అవసరమైన రుణాలను కార్పొరేషన్ ద్వారా అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
రెడ్డి సంఘాల జిల్లా అడక్ కమిటీ అధ్యక్షుడు జుక్కంటి మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి కుటుంబాలు అధిక సంఖ్యలో ఉన్నాయని తెలిపారు. ఈడబ్ల్యూఎస్ (EWS) రిజర్వేషన్‌ను పేద రెడ్డి యువత ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, బ్యాంకు రుణాల కోసం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రెడ్డి అంటే కేవలం వ్యాపారి కాదని, కష్టపడి శ్రమించే రైతు అని ప్రభుత్వాలు గుర్తించాలని అన్నారు. రెడ్డి కార్పొరేషన్‌కు వెంటనే చైర్మన్, పాలకవర్గాన్ని నియమించి నిధులను విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు చేపట్టి హక్కుల కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు.
రాష్ట్ర అధికార ప్రతినిధి కే. రాజ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో రెడ్డి సంఘాలు ఐక్యంగా పనిచేస్తూ సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా పేద రెడ్డి కుటుంబాల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సదాశివనగర్ మండల అధ్యక్షుడు డాక్టర్ ఎర్రవట్టి లింగారెడ్డి మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి 13 గ్రామాల రెడ్డి సంఘాల పెద్దలు మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల రెడ్డి సంఘాలను కలుపుకొని మండలంలోని రెడ్డి సంఘాన్ని బలోపేతం చేస్తానని తెలియజేశారు.












