నిజామాబాద్, July 25
గోదావరి పుష్కరాలు–2027 సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్, ఐపీఎస్., ఉన్నతాధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రెంజల్, మెండోరా, ఏర్గట్ల ఘాట్ల వద్ద భద్రత, ట్రాఫిక్, అత్యవసర సేవలపై ప్రత్యేకంగా సమీక్షించారు.
గోదావరి పుష్కరాలు–2027 సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్, ఐపీఎస్., శనివారం గోదావరి పరివాహక ప్రాంతాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పుష్కరాల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నిర్వహణ, అత్యవసర సేవల సమన్వయం, విపత్తు నిర్వహణ, సమాచార వ్యవస్థల బలోపేతం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రెంజల్, మెండోరా, ఏర్గట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పుష్కర ఘాట్ల వద్ద చేపడుతున్న ఏర్పాట్లపై ప్రత్యేకంగా చర్చించారు. తాత్కాలిక పోలీస్ అవుట్‌పోస్టుల ఏర్పాటు, ఆధునిక కమాండ్ అండ్ కంట్రోల్ హాల్ నిర్మాణం, సీసీటీవీ కెమెరాల విస్తరణ, డ్రోన్ నిఘా, పబ్లిక్ అడ్రస్ వ్యవస్థ, బ్యారికేడింగ్, పార్కింగ్ ప్రణాళిక, ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు, మహిళలు, చిన్నారులు, వృద్ధుల కోసం ప్రత్యేక సహాయక కేంద్రాల ఏర్పాటుపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.
అదేవిధంగా భారీగా తరలివచ్చే భక్తుల రద్దీని సమర్థంగా నియంత్రించేందుకు క్యూ లైన్ నిర్వహణ, విపత్తు నిర్వహణ బృందాల సిద్ధత, అగ్నిమాపక, వైద్య, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం, తాగునీరు, విద్యుత్ వెలుగులు, పారిశుద్ధ్యం, తప్పిపోయిన వారి కోసం ప్రత్యేక కేంద్రాలు, సమాచార వ్యవస్థల పటిష్ఠీకరణ వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రతి పోలీస్ యూనిట్ ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని, అన్ని శాఖలతో సమన్వయం పెంచుకుని భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన పుష్కరాలను అందించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్ ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాశ్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు ప్రకాశ్, వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు ధర్ రెడ్డి, మల్లేష్, గోదావరి పరివాహక ప్రాంతాల సీఐలు, ఎస్ఐలు, కార్యాలయ సూపరింటెండెంట్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.












