సంగారెడ్డి, జూలై 24
పర్యావరణ పరిరక్షణలో భాగంగా సదాశివపేట మండల విద్యాధికారి ఎన్.శంకర్ పిలుపు మేరకు ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలిచారు. సదాశివపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మూడు రోజుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటున్న ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన సమయంలో ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లకు బదులుగా స్టీల్ ప్లేట్లలో భోజనం చేశారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా సదాశివపేట మండల విద్యాధికారి ఎన్.శంకర్ పిలుపు మేరకు ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలిచారు. సదాశివపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మూడు రోజుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటున్న ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన సమయంలో ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లకు బదులుగా స్టీల్ ప్లేట్లలో భోజనం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా మండల విద్యాధికారి ఎన్.శంకర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ పర్యావరణానికి పెనుముప్పుగా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలు, ప్రత్యామ్నాయ మార్గాలపై అవగాహన కల్పించాలని కోరారు.
చిన్న చిన్న మార్పులతోనే పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని, ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులు కావాలని పిలుపునిచ్చారు. మన మండలానికి చెందిన నిజాంపూర్ కాలనీ పాఠశాలకు 2025 సంవత్సరంలో రాష్ట్ర స్థాయి పురస్కారం లభించిందని ఈ సందర్బంగా తెలియజేశారు.
ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా స్టీల్ ప్లేట్లు వాడడం పట్ల మండల విద్యాధికారి శంకర్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులతో పాటు సమాజంలో కూడా ప్లాస్టిక్ నిషేధంపై చైతన్యం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిజాంపూర్ కాలనీ ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, సి.ఆర్.పిలు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.









