(సీఐడీ) (ప్రశ్న ఆయుధం) జూలై 31
నేర పరిశోధన విభాగం (సీఐడీ)లో 42 ఏళ్లపాటు నిష్కళంకంగా సేవలందించిన ఇన్స్పెక్టర్ ఆంజనేయులు శుక్రవారం పదవీ విరమణ చేశారు. హైదరాబాద్లోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ వీడ్కోలు కార్యక్రమంలో ఆయనకు ఘనంగా సన్మానం చేశారు.
నేర పరిశోధన విభాగం (సీఐడీ)లో 42 ఏళ్లపాటు నిష్కళంకంగా సేవలందించిన ఇన్స్పెక్టర్ ఆంజనేయులు శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో సీఐడీ డీఐజీ పరిమళ హనా నూతన్, సీఐడీ ఎస్పీ డాక్టర్ నవీన్ కుమార్ (ఐపీఎస్), అడ్మిన్ ఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో నిబద్ధత, నిజాయితీ, సమర్థతతో ఆంజనేయులు పోలీసు శాఖలో విశిష్ట గుర్తింపు పొందారని కొనియాడారు. నాలుగు దశాబ్దాలకు పైగా మచ్చలేని సేవలు అందించడం ఆదర్శనీయమని పేర్కొన్నారు. అనంతరం శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు.
ఆంజనేయులు తన సేవా కాలంలో నిజామాబాద్ జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తించారు. అనంతరం సీఐడీలో బాధ్యతలు చేపట్టి పలు క్రిమినల్, ఆర్థిక నేరాల దర్యాప్తులో సమర్థవంతంగా పనిచేసి ప్రశంసలు అందుకున్నారు. తర్వాత హైదరాబాద్ సీఐడీ ప్రధాన కార్యాలయానికి బదిలీపై వెళ్లి అక్కడే పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు పోలీసు అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
పదవీ విరమణ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. తన సుదీర్ఘ సేవా కాలంలో సహకరించిన ఉన్నతాధికారులు, సహోద్యోగులు, సిబ్బంది, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. శాఖకు, ప్రజలకు అంకితభావంతో సేవలందించే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సీఐడీ అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.











