ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమంలో అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధుల బాధ్యతలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు.
అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడం ప్రతి ప్రజా ప్రతినిధి బాధ్యత అని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవారికి చేరేలా కృషి చేయాలని, ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను గుర్తించి, అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పరిష్కరించాలని కోరారు.
జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర స్థాయిలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయబడిందని తెలిపారు. మార్చి 6న ప్రారంభమైన ఈ కార్యక్రమం జూన్ 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుందని, ఇందులో పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం, సంక్షేమ పథకాల అమలు, విద్య, పర్యావరణ పరిరక్షణ వంటి పలు అంశాలపై దృష్టి సారిస్తామని వివరించారు.
ఈ 99 రోజుల కార్యాచరణలో భాగంగా వివిధ శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను కలెక్టర్ పరిశీలించారు. శిక్షణా కేంద్రంలో ప్రజా ప్రతినిధులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించామని, గ్రామాలు, పట్టణాల్లో ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరేలా చూడడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ శిక్షణలో భాగంగా పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు, అన్ని శాఖలు తమ పరిధిలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసే విధంగా ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రజా ప్రతినిధులు ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామాలు, పట్టణాల్లో అమలు చేసి అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

