ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ ద్వారా సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చూడాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టరేట్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించాలని కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అధికారుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
మార్చి 6న ప్రారంభమైన ఈ కార్యక్రమం జూన్ 12 వరకు కొనసాగుతుందని, దీనిని ఐదు దశల్లో, పది ప్రధాన అంశాల ఆధారంగా అమలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు.
ఏప్రిల్ 2న నిర్వహించనున్న గ్రామ, వార్డు సభల్లో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని కోరారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా–యువత సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై అధికారులకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ నియంత్రణ, రహదారి భద్రత, అడవుల సంరక్షణ, మొక్కల పెంపకంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. అదనపు కలెక్టర్లు, డీఆర్వో, జిల్లా మార్కెటింగ్ ఛైర్మన్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్, ఆర్టీఏ కమిషన్ సభ్యులు, ట్రాఫిక్ ఏసిపి, మున్సిపల్ కమిషనర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

