ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ తెలిపారు. నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంఘమల్లయ్య పల్లె గ్రామంలో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల నుండి వచ్చి పనిచేస్తున్న వ్యక్తులపై పోలీసుల నిఘా కొనసాగుతుందని తెలిపారు. స్థానికంగా ఇళ్లు అద్దెకు ఇచ్చే యజమానులు అద్దెదారుల పూర్తి వివరాలు తప్పనిసరిగా సేకరించి, వారి ఆధార్ కార్డు, శాశ్వత చిరునామా, గతంలో పనిచేసిన వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం నమోదు చేసుకోవాలని సూచించారు.
జీవనోపాధి కోసం వచ్చిన వారు ప్రశాంతంగా జీవనం సాగించాలని, చట్టబద్ధంగా పనులు చేసుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు, ప్రమాదాలు జరిగినప్పుడు నిందితులను సులువుగా పట్టుకోవచ్చని తెలిపారు.
యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, గంజాయి, మత్తు పదార్థాల విక్రేతల సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు. వేసవి నేపథ్యంలో విహార యాత్రలకు వెళ్లేవారు విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలని సూచించారు.
రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాలు విధించినట్లు తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.











