ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డిపో సెంటర్ సమీపంలోని శ్రీరామ్ లాడ్జిలో ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న అంధురాలైన ఆదిలక్ష్మి అనే ప్రభుత్వ ఉద్యోగిని గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం, రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆదిలక్ష్మి తిరిగి రాకపోవడంతో ఆమె భర్త మల్లికార్జున్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
విచారణలో ఆదిలక్ష్మి, వెంకటరమణ అనే వ్యక్తితో కలిసి శ్రీరామ్ లాడ్జిలో దిగినట్లు గుర్తించారు. పోలీసులు లాడ్జికి చేరుకుని గదిని తెరిచి చూడగా, ఆదిలక్ష్మి రక్తపు మడుగులో మృతిచెంది కనిపించింది. ఆమె గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, భర్త ఫిర్యాదు మేరకు మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆదిలక్ష్మితో పాటు ఉన్న వెంకటరమణ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఎస్పీ వెల్లడించారు.
పోలీసులు లాడ్జి సిబ్బందిని విచారిస్తూ, సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. హత్యకు గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని, అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని తెలిపారు.











