కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శాఖలో గురువారం సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత, వేసవి జాగ్రత్తలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు, రాజంపేట సబ్ఇన్స్పెక్టర్ బి. మహేష్ సూచనలతో పోలీస్ కళాబృందం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా ప్రజలకు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. బ్యాంకు అధికారులు గానీ, పోలీసు అధికారులు గానీ ఎప్పుడూ ఓటీపీలు అడగరని, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత సమాచారం, ఓటీపీలు ఇతరులకు చెప్పవద్దని వివరించారు.
సైబర్ నేరాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్–100కు కాల్ చేయాలని సూచించారు. మహిళల భద్రత కోసం షీ టీమ్ సేవలు అందుబాటులో ఉన్నాయని, సహాయం కోసం 972686094 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. అలాగే వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అధిక వేడి సమయంలో అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.
మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ యువత దూరంగా ఉండాలని కోరారు. పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుళ్లు రామంచ తిరుపతి, శేషరావు, పోలీస్ కానిస్టేబుళ్లు ప్రభాకర్, సాయిలు పాటలు, మాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ రాజశేఖర్ గౌడ్, లింగంపేట హెడ్ కానిస్టేబుల్ రమేష్, కామారెడ్డి షీ టీమ్ సభ్యురాలు పీసీ భాను రెడ్డి, బ్యాంకు ఖాతాదారులు పాల్గొన్నారు.












