ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్ల పరిష్కారం, సమ్మె విరమణలో ఐ.ఎన్.టి.యు.సి కీలక పాత్ర పోషించిందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని ఐ.ఎన్.టి.యు.సి జాతీయ అధ్యక్షులు, మాజీ ఎంపీ జి. సంజీవ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కారానికి అంగీకరించడం పట్ల ఆయన ముఖ్యమంత్రి, మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల డిమాండ్లను పట్టించుకోలేదని, 52 రోజుల సమ్మెలో 34 మంది కార్మికులు మరణించారని జి. సంజీవ రెడ్డి గుర్తు చేశారు. దీనికి భిన్నంగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రోజుల సమ్మెలోనే చర్చలు జరిపి, 32 డిమాండ్లను అంగీకరించి సమ్మెను విరమింపజేసిందని ఆయన పేర్కొన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తాము ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామని, వేతన సవరణలో 11 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించడం అభినందనీయమని సంజీవ రెడ్డి తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై త్వరలోనే మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి, జూన్ 2న ప్రకటన చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన వెల్లడించారు.
గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడం కూడా హర్షణీయమని, ఇది కార్మికుల గొంతుకగా నిలుస్తుందని అన్నారు. సమ్మెలో మరణించిన డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.











