జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా, కామారెడ్డి జిల్లాలో స్వీయ గణన కార్యక్రమాన్ని 26-04-2026 నుండి 10-05-2026 వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు ప్రధాన గణన అధికారి శ్రీ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం https://se.census.gov.in వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చిందని, ప్రతి కుటుంబం దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
జిల్లాలో జనగణన-2027 ప్రక్రియలో భాగంగా గృహ లెక్కింపు, గృహ గణన – హెచ్ఎల్ఓ కార్యకలాపాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రజలు తమ ఇంటి వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు స్వీయ గణన అవకాశం కల్పించబడింది. ఈ ప్రక్రియను మొబైల్ ఫోన్, కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఏదైనా పరికరం ద్వారా పూర్తి చేయవచ్చు.
స్వీయ గణన పూర్తయిన తర్వాత, ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించబడుతుంది. ఈ సంఖ్యను ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్‌కు తప్పనిసరిగా తెలియజేయాలి. అవసరమైతే, నమోదు చేసిన వివరాలను తర్వాత సవరించుకునే వెసులుబాటు కూడా కల్పించబడింది.
జనగణన ద్వారా సేకరించిన సమాచారం దేశ, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు కీలకమని కలెక్టర్ సంగ్వాన్ నొక్కిచెప్పారు. కాబట్టి, ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా, సరైన సమాచారాన్ని నమోదు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రజలందరూ స్వీయ లెక్కింపులో చురుగ్గా పాల్గొని, జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
స్వీయ గణన కార్యక్రమం 26 ఏప్రిల్ 2026 నుండి 10 మే 2026 వరకు జరుగుతుంది. ఆ తర్వాత, గృహ లెక్కింపు మరియు గృహ గణన – హెచ్ఎల్ఓ ప్రక్రియ 11 మే 2026 నుండి 9 జూన్ 2026 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమాల్లో ప్రతి కుటుంబం తప్పనిసరిగా పాల్గొనాలని కలెక్టర్ సూచించారు.












