ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. బెటాలియన్-1కి చెందిన కమాండర్ హేమ్లా విజ్జ అలియాస్ ఐతుతో సహా 47 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా వారు 32 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు.
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ లొంగుబాటు కార్యక్రమంలో, ఛత్తీస్‌గఢ్ బెటాలియన్-1 పూర్తిగా నిర్వీర్యమైందని ఆయన మీడియాకు తెలిపారు. వీరి వద్ద నుంచి ల్యాండ్ మైన్లలో వాడే వైర్లు 3 బండిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు, సౌత్ బస్తర్ డివిజన్‌కు చెందిన కీలక మావోయిస్టు లొంగిపోవడం ఒక ముఖ్య పరిణామమని పేర్కొన్నారు.
లొంగిపోయిన వారిలో తెలంగాణకు చెందిన వారు ఎవరూ లేరని డీజీపీ స్పష్టం చేశారు. అయితే, వీరు తెలంగాణలో కార్యకలాపాలు సాగించినట్లు ఆయన తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పునరావాస ప్యాకేజీతో పాటు, కేంద్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహాన్ని కూడా అందజేస్తామని డీజీపీ హామీ ఇచ్చారు.
ఈ లొంగుబాటులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ పోలీసుల కృషిని డీజీపీ ప్రశంసించారు. వారి అంకితభావం, సమన్వయం, వృత్తిపరమైన నైపుణ్యం వల్లే 47 మంది అజ్ఞాతం వీడారని తెలిపారు. లొంగిపోయిన వారి సంఖ్య, అప్పగించిన ఆయుధాలను బట్టి మావోయిస్టు పార్టీ క్రమంగా క్షీణిస్తూ, పతనం అవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
2026 వరకు తెలంగాణలో మొత్తం 260 మంది అజ్ఞాత మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన నలుగురు మావోయిస్టు కేడర్లు మాత్రమే అజ్ఞాతంలో ఉండి, తెలంగాణ వెలుపల కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, వీరిలో కొందరు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో ఉన్నారని ఆయన తెలిపారు.












