వేసవిలో త్రాగునీటి కొరత సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో హెల్ప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ అంకిత్, ఐడీఓసీ కార్యాలయం నుండి జూమ్ సమావేశం ద్వారా భద్రాచలం పి.ఓ రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులతో వేసవిలో త్రాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. మండల స్థాయిలో త్రాగునీటి సరఫరా పర్యవేక్షణ బాధ్యత ఎంపీడీవోలదేనని ఆయన స్పష్టం చేశారు.
మిషన్ భగీరథ అధికారులు, ఎంపీడీవోలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రతి గ్రామానికి నిరంతర నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి త్రాగునీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, నీటి వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
ప్రతి మండలం, గ్రామంలో బోర్వెల్లు, చేతి పంపులు వంటి ప్రత్యామ్నాయ వనరులను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చేపట్టాలని స్పష్టం చేశారు. మోటార్లలో లోపాలు తలెత్తినపుడు తక్షణమే మరమ్మతులు చేయడానికి అదనపు మోటార్లు, జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. త్రాగునీటి సరఫరా పరిస్థితిపై ప్రతిరోజూ నివేదికలు సమర్పించాలని అధికారులకు సూచించారు.
జిల్లా వ్యాప్తంగా ఎంపీడీవో, ఎంఆర్ఓ కార్యాలయాల్లో హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని, గ్రామాల్లో చివరి దూర ప్రాంతాలకు కూడా ఎటువంటి అంతరాయం లేకుండా నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమస్య తలెత్తిన వెంటనే గరిష్టంగా 24 గంటల్లోపు పరిష్కరించాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు ప్రతి వార్డులో ఉదయం నీటి సరఫరా సమయంలో క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించి, ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.











