భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో ఘనంగా వేడుకలు జరిగాయి. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మున్సిపల్ చైర్పర్సన్ వనిత సంతోష్, అదనపు కలెక్టర్ పాండు తదితరులు పాత బస్టాండ్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ దూరదృష్టి వల్లే భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా అభివృద్ధి చెందిందని, సమాన హక్కుల కల్పనకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. విద్య ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, యువత అంబేద్కర్ చూపిన మార్గంలో నడుచుకుని రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానుభావుడిగా నిలిచిపోయారని తెలిపారు. యువత చదువుపై దృష్టి సారించి, సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని, ధైర్యం, నమ్మకంతో ముందుకు సాగితే దేశ ప్రగతికి తోడ్పడతారని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలైన సమానత్వం, విద్య, స్వాభిమానం ఆచరణలో పెట్టి సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, సాంస్కృతిక సారథి కళాకారుల పాటలు ఆకట్టుకున్నాయి. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, కుల, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, యువత, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.












