భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బాలానగర్లో జరిగిన వేడుకలకు సైబరాబాద్ మున్సిపల్ జనసేన పార్టీ కో ఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ దళిత సంక్షేమ సంగం నాయకుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రేమ కుమార్, అంబేద్కర్ భారత దేశానికి రాజ్యాంగాన్ని అందించి, ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన గొప్ప దూరదృష్టి కలిగిన నాయకుడని అన్నారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.
అంబేద్కర్ చూపిన సమానత్వం, విద్య, స్వాభిమానం, సామాజిక న్యాయం అనే మార్గంలో నడుస్తూ, సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం మనమంతా కట్టుబడి పనిచేయాలని ప్రేమ కుమార్ పిలుపునిచ్చారు. యువత అంబేద్కర్ ఆలోచనలను అవగాహన చేసుకుని, దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు.
అనగారిన వర్గాల జనుల అభ్యున్నతి కోసం, అన్ని వర్గాల ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, న్యాయం అందాలని అంబేద్కర్ విశేషంగా కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, భోగాది వెంకటేశ్వరరావు, నాగేంద్ర, వేముల మహేష్, జెన్నీ సునీల్, పండుగ సూర్య, నరేశ్, ఎస్. సుధీర్, ఆర్. దీపక్, పోలెబోయిన శ్రీనివాస్, బండ్రెడ్డి రణదీప్ తదితరులు హాజరయ్యారు.











