పెళ్లి అయిన 50 రోజులకే అదనపు కట్నం కోసం భర్త వేధింపులకు గురై ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మియాపూర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బిహార్‌కు చెందిన ఇషిక యాదవ్ (26), మధ్యప్రదేశ్‌కు చెందిన నీరజ్ బన్సాల్ (గచ్చిబౌలి స్టార్టప్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్) ఐదేళ్ల క్రితం ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యారు. వారి స్నేహం ప్రేమగా మారి, పెద్దల అంగీకారంతో గత ఫిబ్రవరి 10న పట్నాలో వివాహం చేసుకున్నారు. మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు.
బుధవారం ఇంట్లో ఇషిక ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తమ కుమార్తెను బంగారం, వజ్రాభరణాలు, అదనపు కట్నం కోసం భర్త, అతని కుటుంబ సభ్యులు వేధించారని, ఈ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.











