రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన వరకట్నం వేధింపుల హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు పడింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ ఈ తీర్పును వెల్లడించారు.
రుద్రంగి గ్రామానికి చెందిన హేమలతను, అదే గ్రామానికి చెందిన సింగారపు జనార్ధన్ కు వివాహం చేశారు. పెళ్లైన కొద్ది రోజులకే అదనపు కట్నం కోసం భర్త, అతని కుటుంబ సభ్యులు హేమలతను వేధించడం ప్రారంభించారు. ఈ వేధింపులు తారాస్థాయికి చేరడంతో, 3-4-2018న ఆమెను రోకలి బండతో కొట్టి హత్య చేశారు.
మృతురాలి సోదరుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. అప్పటి డీఎస్పీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయగా, ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించారు. సాక్షుల విచారణ, ఆధారాల పరిశీలన అనంతరం న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
ఈ కేసులో భర్త సింగారపు జనార్ధన్, ఆడపడుచు సింగారపు శారద, మేనల్లుడు తెడ్డు సాగర్ లకు జీవిత ఖైదు విధించారు. వీరితో పాటు రూ. 2000 జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. కాగా, నాల్గవ నిందితురాలు సింగారపు దివ్య మైనర్ కావడంతో ఆమెపై కేసు జువినల్ కోర్టులో కొనసాగుతోంది.
నేరస్తులకు శిక్షలు తప్పవని, శిక్షల ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలిపారు. కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, న్యాయవాదులను ఆయన అభినందించారు.











