ఎలాంటి తప్పులు లేని, అత్యంత పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే జిల్లా యంత్రాంగం, రాజకీయ పార్టీల ముఖ్య లక్ష్యంగా ఉండాలని అదనపు కలెక్టర్ విక్టర్ పిలుపునిచ్చారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, జిల్లా యంత్రాంగం అత్యంత పారదర్శకంగా, ఖచ్చితమైన విచారణతో పనిచేస్తుందని అదనపు కలెక్టర్ తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని, ఇందుకోసం ప్రతి పార్టీ బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించి, ప్రజాస్వామ్య బలోపేతంలో భాగస్వాములు కావాలని, అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జూన్ 15 నుంచి ప్రారంభమవుతుందని, జూన్ 15 నుంచి 24 వరకు బీఎల్ఓలకు శిక్షణ, ప్రిపరేషన్, ప్రింటింగ్ జరుగుతుందని తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి సమగ్ర విచారణ చేపడతారని, జూలై 24న పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని, జూలై 31న ముసాయిదా జాబితా ప్రచురిస్తామని వివరించారు.
ముసాయిదా జాబితాపై జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరించి, సెప్టెంబర్ 28 వరకు పరిష్కరిస్తారని, అక్టోబర్ 1న తుది జాబితా ప్రచురిస్తామని తెలిపారు. బీఎల్ఓల పాత్ర కీలకం అని, వారు క్షుణ్ణంగా విచారణ చేసిన తర్వాతే కొత్త ఓటరు నమోదు ప్రక్రియ చేపడతారని, మరణించిన వారి పేర్ల తొలగింపు, వలస వెళ్లిన వారిని గుర్తించడం, కొత్త ఓటర్లను చేర్చడం వంటి బాధ్యతలు వారిపై ఉంటాయని స్పష్టం చేశారు.
కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటులో ప్రతి కేంద్రంలో గరిష్టంగా 1200 మంది ఓటర్లు ఉండేలా, 2 కిలోమీటర్లకు మించి ప్రయాణించాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 01-10-2026 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి యువతీ యువకుడు ఫామ్-6 ద్వారా, మార్పులు చేర్పుల కోసం ఫామ్-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దృఢమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు.












