సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటుండగా మహిళా ఎస్సై నందిత అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఒక కేసులో నిందితులను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు రూ. 30,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
కేసుల విషయంలో న్యాయం చేయకుండా, డబ్బుల కోసం ఒత్తిడి తెచ్చిన ఘటనలో మహిళా ఎస్సై నందితపై బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, పోలీస్ స్టేషన్ లోనే కానిస్టేబుల్ విజయ్ సహాయంతో ఎస్సై నందిత నగదు స్వీకరిస్తుండగా పట్టుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ చలసాని శ్రీధర్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది. అధికారులు పోలీస్ స్టేషన్ లోని పలువురు సిబ్బంది సెల్ ఫోన్ లను కూడా స్వాధీనం చేసుకుని, సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ అరెస్ట్ తో పోలీస్ శాఖలో తీవ్ర కలకలం నెలకొంది. లంచం వ్యవహారంపై ఏసీబీ అధికారులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. నిందితుల నుండి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.







