కామారెడ్డి జిల్లా, సదాశివ నగర్ మండలం, భూంపల్లి గ్రామంలో పసుల శ్రీనివాస్ (35) అనే యువకుడు మంగళవారం సాయంత్రం వడదెబ్బతో మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కూలి పనులు చేసుకునే పసుల శ్రీనివాస్, ఎండ తీవ్రత కారణంగా మంగళవారం సాయంత్రం ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే అకస్మాత్తుగా మరణించినట్లు మృతుని అన్న, మాజీ ఉపసర్పంచ్ పసుల సాయిలు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
బుధవారం భూంపల్లి గ్రామంలో జరిగిన అంత్యక్రియలకు మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు హాజరై, మృతుని కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవడం తీరని లోటని, ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గైని శ్రీనివాస్, ఉప సర్పంచ్ దాని రాజయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు కిషన్ రావు, జర్నలిస్ట్ గైని శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు. మృతుని కుటుంబానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అందరితో సఖ్యతగా ఉండే పసుల శ్రీనివాస్ అకాల మరణంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడిందని, రాష్ట్ర ప్రభుత్వం తగిన సహాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.












