సినీ నటుడు ప్రకాష్ రాజ్ హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, రంగారెడ్డి అర్బన్ బీజెపి అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రకాష్ రాజ్ ను చంపితే తాను బాధ్యత వహిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రంగారెడ్డి అర్బన్ బీజెపి అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, సనాతన హిందూ ధర్మంపై కొందరు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అలాంటి వారిని ఊరికించి కొడతామని హెచ్చరించారు.
ఇటీవల ప్రకాష్ రాజ్ శ్రీరాముడు, లక్ష్మణుడులపై చేసిన వ్యంగ్య వ్యాఖ్యలను ఉద్దేశించి, కర్మన్ ఘాట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రకాష్ రాజ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్ ను అన్ని సినిమా ఇండస్ట్రీలలో నిషేధించాలని డిమాండ్ చేశారు.
శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, "ప్రకాష్ రాజ్ ను ఎవరైనా చంపితే అందుకు నేను బాధ్యత వహిస్తాను" అని సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మంపై ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని, ప్రకాష్ రాజ్ ఎక్కడ షూటింగ్ జరిగితే అక్కడికి వచ్చి కొడతామని హెచ్చరించారు.
సినీ అగ్ర హీరోలు, నిర్మాతలు ప్రకాష్ రాజ్ ను నిషేధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నాస్తికుడు అనే ముసుగులో హిందూ ధర్మంపై దాడి చేస్తున్నారని, ఇలాంటివారికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజెపి నాయకులు పాల్గొన్నారు.











