తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ నివేదికపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కుట్రలు ఈ తీర్పుతో బట్టబయలయ్యాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజస్వరూపం తేటతెల్లం అయిందని ఆయన ఆరోపించారు.
హైకోర్టు తీర్పును ఉద్దేశించి హరీశ్ రావు సోషల్ మీడియా వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం, సత్యం విజయం సాధిస్తాయని ఆయన పేర్కొన్నారు.
పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం స్పష్టం చేసిందని హరీశ్ రావు తెలిపారు. ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరించి నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టిందని ఆయన పేర్కొన్నారు.
వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని, ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంగా తీర్పు వచ్చిందని ఆయన వివరించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బయటపడ్డాయని అన్నారు.
ప్రజా సమస్యలను పక్కనపెట్టి డ్రామాలు ఆడిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయిందని హరీశ్ రావు విమర్శించారు. కక్షసాధింపులు, రాజకీయ దుష్ప్రచారం మానేసి వెంటనే రెండు పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరమని ఆయన పునరుద్ఘాటించారు.











