దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ఓటుకు నోటు' కేసులో సుప్రీంకోర్టులో సోమవారం కీలక విచారణ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం విచారించనుంది. ఈరోజు సాయంత్రం 3:30 గంటలకు విచారణ జరిగే అవకాశం ఉంది.
జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా, ఎన్నికల చట్టాల పరిధిలో విచారించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో చట్టపరమైన సాంకేతిక అంశాలను ఆయన ప్రస్తావించారు.
మరోవైపు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా ఈ కేసుతో తనకు సంబంధం లేదని, తన పేరును నిందితుల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇద్దరి పిటిషన్లు ఒకే కేసుకు సంబంధించినవి కావడంతో, ధర్మాసనం వాటిని కలిపి విచారించాలని నిర్ణయించింది.
ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ విచారణ ఫలితం కేసు భవిష్యత్తును నిర్దేశించనుంది.











