తిరుపతి జిల్లా, వెంకటగిరి ప్రభుత్వ జడ్పీ పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థినులు తమ నిజాయితీతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. రోడ్డుపై దొరికిన సుమారు 6 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, నగదుతో కూడిన పర్సును గుర్తించి, వాటిని పోలీసుల ద్వారా అసలు యజమానులకు చేర్చడంలో వీరి పాత్ర ప్రశంసనీయం.
గురువారం సాయంత్రం వెంకటగిరి ఎస్బీఐ బ్యాంకు సమీపంలో పాఠశాల ముగిసిన తర్వాత బస్సు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థినులకు ఒక పర్సు కనిపించింది. ఆ పర్సులో విలువైన బంగారు ఆభరణాలు, నగదుతో పాటు ఆధార్ వంటి గుర్తింపు పత్రాలు ఉండటాన్ని గమనించారు.
వెంటనే స్పందించిన విద్యార్థినులు, ఆ పర్సును వెంకటగిరి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అక్కడి అధికారులకు అప్పగించారు. పోలీసులు ఆ పర్సులోని గుర్తింపు పత్రాల ఆధారంగా యజమానులను గుర్తించి, ఆ విలువైన వస్తువులను వారికి సురక్షితంగా అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., విద్యార్థినుల నిజాయితీని మనస్ఫూర్తిగా అభినందించారు. చిన్న వయసులోనే వారు చూపిన ఈ గొప్ప గుణం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థినులను ఆశీర్వదిస్తూ, వారు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
వారి నిజాయితీ సమాజానికి స్ఫూర్తిదాయకమని తెలియజేస్తూ, జిల్లా ఎస్పీ విద్యార్థినులను ప్రశంసాపత్రాలు, పుస్తకాలు మరియు నగదు బహుమతితో సత్కరించారు. వారి నిజాయితీని గుర్తించి ప్రోత్సహించడం ద్వారా సమాజంలో మంచి విలువలను పెంపొందించే ప్రయత్నం చేశారు.

