కామారెడ్డి పట్టణంలోని ఆర్బీ నగర్ ప్రాంతానికి చెందిన ముగ్గురు చిన్నారులు శనివారం ఉదయం అదృశ్యమవ్వడంతో స్థానికంగా కలకలం రేగింది. షీపాత్ (8), అయాత్ (7), మరియం (5) అనే బాలికలు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
శనివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలికలు ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు.
వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు అదృశ్యమైన బాలికల కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. వివిధ బృందాలుగా ఏర్పడి చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ, అనుమానిత ప్రదేశాల్లోనూ గాలిస్తున్నారు.
ఈ సంఘటనతో ఆర్బీ నగర్ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. బాలికల ఆచూకీ గురించి ఏవైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
సంఘటనకు సంబంధించి కామారెడ్డి పట్టణ పోలీసులు 8712686145, 9949994822 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. ప్రజలు సహకరించి బాలికల ఆచూకీని కనుగొనడంలో సహాయపడాలని కోరారు.


