ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కలెక్టర్ ఆసుపత్రిలో నిర్వహణ విధానాన్ని సమగ్రంగా పరిశీలించి, రిజిస్టర్లు, ల్యాబ్, ఫార్మసీ విభాగాలను తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.
గర్భిణులతో ప్రత్యేకంగా మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలు, చెకప్‌లు క్రమం తప్పకుండా జరుగుతున్నాయా అనే విషయాలను తెలుసుకున్నారు. డాక్టర్లు, సిబ్బంది సమయపాలన, మందుల లభ్యతపై అధికారులను ప్రశ్నించారు.
మెడికల్ ఆఫీసర్ తెలిపిన వివరాల ప్రకారం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరియు ఇతర అత్యవసర మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి రోజు ఇన్‌పేషెంట్స్, ఔట్‌పేషెంట్స్ సంఖ్య, గర్భిణీల చెకప్‌లు, అందుబాటులో ఉన్న పరీక్షలు, నెలవారీ ప్రసవాల సంఖ్య వంటి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని, ముఖ్యంగా సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా వైద్యులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమా హారతి, ఎంపీడీవో, మెడికల్ ఆఫీసర్, తదితరులు పాల్గొన్నారు.








