నందిపేట్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ రవీందర్ నాయక్ శనివారం సందర్శించారు. ఈ పీహెచ్సీని 24 గంటలూ డాక్టర్లు అందుబాటులో ఉండేలా, 30 పడకల ఆరోగ్య కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను ఆయన అంచనా వేశారు. స్థానిక ప్రజా ప్రతినిధుల వినతుల మేరకు ఈ సందర్శన జరిగింది.
స్థానిక సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం, నందిపేట మండల సర్పంచులు కలిసి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఈ పీహెచ్సీని 24 గంటల సేవలు, 30 పడకల ఆసుపత్రిగా విస్తరించాలని విన్నవించారు. ఈ వినతి మేరకు, డాక్టర్ రవీందర్ నాయక్ ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, సౌకర్యాలను సమీక్షించారు.
నిజామాబాద్ డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ, స్థానిక నాయకుల అభ్యర్థన మేరకు డైరెక్టర్ పీహెచ్సీని సందర్శించారని, 30 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలను పర్యవేక్షించారని తెలిపారు. ఈ విషయంపై ఆరోగ్య శాఖ మంత్రికి, అధికారులకు నివేదిక అందజేస్తామని ఆమె పేర్కొన్నారు.
సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం మాట్లాడుతూ, మండల జనాభా, రోగుల తాకిడిని పరిగణనలోకి తీసుకుని 30 పడకల కేంద్రాన్ని మంజూరు చేస్తే పేదలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అరికట్టడానికి ఈ చర్యలు అవసరమని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఆయన తెలిపారు. త్వరలోనే 30 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.











