కామారెడ్డి జిల్లాలో మహిళల్లో ప్రాణాంతకమైన గర్భాశయ క్యాన్సర్‌ను నివారించేందుకు ప్రభుత్వం హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం నుంచి ఈ టీకా కార్యక్రమం మొదలైంది. మొదటి దశలో 14 ఏళ్ల లోపు బాలికలకు ఈ టీకాలను అందిస్తున్నారు.
వైద్యుల కథనం ప్రకారం, హెచ్‌పీవీ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్‌ను 95 శాతం వరకు నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని అంతర్జాతీయ అధ్యయనాలు వెల్లడించాయి. ఈ టీకా పూర్తిగా సురక్షితమని, ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలు ఉండవని అధికారులు స్పష్టం చేశారు. తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా తమ కుమార్తెలకు టీకా వేయించాలని వారు సూచించారు.
ఆదివారం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు సుమారు 17 మంది బాలికలకు విజయవంతంగా వ్యాక్సినేషన్ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కామారెడ్డి, బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. వచ్చే నెల నుంచి జిల్లాలోని అన్ని మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఈ వ్యాక్సినేషన్ సేవలను విస్తరించాలని యోచిస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని అఖిల్, వెంకటేశ్వర్లు, రాంరెడ్డి, శ్యామలతో పాటు ఏఎన్ఎంలు విమల, బాలరాజవ్వ పర్యవేక్షించారు. గర్భాశయ క్యాన్సర్ రాకముందే నివారించదగిన వ్యాధి అని, సరైన సమయంలో టీకా వేయించడం ద్వారా ఆడపిల్లల భవిష్యత్తును ఆరోగ్యంగా తీర్చిదిద్దవచ్చని వైద్యులు తెలిపారు.


