కామారెడ్డి పట్టణంలో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య తన భర్తను కొడవలితో హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.
గోసంగీ కాలనీలో జరిగిన ఈ హత్య కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించారు. ఏప్రిల్ 25న జరిగిన ఘటనపై మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
విచారణలో, అదే రోజు రాత్రి భార్య కోదండం లక్ష్మి తన భర్త కోదండం శివాజీపై కొడవలితో దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు తేలింది. పోలీసులు సంఘటనా స్థలం నుంచి కీలక సాక్ష్యాలను సేకరించారు.
ఏప్రిల్ 27న కామారెడ్డి రైల్వే స్టేషన్ వద్ద లక్ష్మిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కొడవలి, రక్తపు మరకలున్న చీరను స్వాధీనం చేసుకున్నారు.
మృతుడు మద్యం, జూదానికి బానిసై, తరచూ భార్యను వేధించేవాడని, ఈ క్రమంలో జరిగిన గొడవలో లక్ష్మి ఆవేశానికి లోనై హత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.











