రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక వృద్ధురాలు దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ లో ఒంటరిగా నివసిస్తున్న కోన లక్ష్మి (75) అనే వృద్ధురాలిని దుండగులు కత్తితో గొంతు కోసి హత్య చేశారు.
మంగళవారం సాయంత్రం తన తల్లిని చూడటానికి వచ్చిన చిన్న కుమారుడు వెంకటేష్, ఇంట్లో తల్లి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మృతురాలు కోన లక్ష్మి ఒంటరిగా నివసిస్తున్నారని, ఆమెకు ముగ్గురు కుమారులు ఉన్నారని తెలిసింది. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, పరిసర ప్రాంతాల్లో ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.











