నిజామాబాద్ పోలీస్ కమిషరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గత వారం రోజుల్లో 138 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని, తొమ్మిది మందికి జైలు శిక్ష, మిగిలిన వారికి రూ.11.10 లక్షల జరిమానా విధించినట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు.
పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మే 25 నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా 138 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు.
పట్టుబడిన వారిలో తొమ్మిది మందిని కోర్టుల్లో హాజరుపరచగా, వారికి వారం రోజుల జైలు శిక్ష విధించారు. మిగిలిన 129 మందికి మొత్తం రూ.11.10 లక్షల జరిమానా విధించినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
ప్రజలకు సూచనలు చేస్తూ, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహన పత్రాలను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తామని, ప్రమాదానికి కారణమైతే బీమా సౌకర్యం లభించదని హెచ్చరించారు.
మైనర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారితో పాటు వాహన యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని, ఒకటి కంటే ఎక్కువసార్లు పట్టుబడితే జైలు శిక్ష తప్పదని తెలిపారు. మొదటిసారి పట్టుబడిన వారికి రూ.10 వేల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష, రెండోసారి పట్టుబడితే రూ.15 వేల జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.








