ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంతెన గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ సిబ్బంది శనివారం మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి మూడు కార్లు, ఒక మోటార్ సైకిల్, పది మొబైల్ ఫోన్లు, రూ.4,880 నగదును స్వాధీనం చేసుకున్నారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ పర్యవేక్షణలో చీతా ఫోర్స్ బృందం ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. మంతెన గ్రామంలోని గురుడు కాపు సంఘం భవనంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు.
పట్టుబడిన తొమ్మిది మంది నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదు, వాహనాలు, మొబైల్ ఫోన్లతో సహా తదుపరి విచారణ మరియు చట్టపరమైన చర్యల నిమిత్తం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
పేకాట, జూదం వంటి అక్రమ కార్యకలాపాలు కుటుంబాల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు, సామాజిక శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాయని పోలీసులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇటువంటి కార్యకలాపాలను అరికట్టేందుకు కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.











