మనూర్ మండలంలోని అతిమ్యాల్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మహేశ్ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత జర్నలిస్టు ఫోరం (డీజేఎఫ్) నాయకులు సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ కు ఫిర్యాదు చేశారు. గత మార్చి 17న వార్త సేకరణకు వెళ్లిన రిపోర్టర్ రాములుపై సదరు ఉపాధ్యాయుడు దాడి చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
దళిత జర్నలిస్టు ఫోరం నాయకులు శుక్రవారం సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ పరితోష్ పంకజ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ దాడిలో ఉపాధ్యాయుడికి సహకరించిన కొందరు గ్రామస్థులపైనా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లా దళిత జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు రాపాక విజయరాజు మాట్లాడుతూ, "సమాజంలో నిజాలను నిర్భయంగా వ్రాసే జర్నలిస్టులపై దాడులు చేయడంపై తీవ్రంగా ఖండిస్తున్నాము" అని అన్నారు. జర్నలిస్టులపై వరుస దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడ్డారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బాధితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దత్తు రెడ్డి, జర్నలిస్టు సాయిలు, దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు తలారి యాదగిరి, పరంజ్యోతి, తదితరులు పాల్గొన్నారు.








