గత ఏడాది జిల్లాలో సంభవించిన వరదల సమయంలో బాధితులకు అండగా నిలిచిన హైదరాబాద్కు చెందిన యూఎస్టీ సాఫ్ట్వేర్ సంస్థ ప్రతినిధులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం అభినందించారు. సంస్థ అందించిన సహాయక కిట్ల పంపిణీని, వారి సేవలను కలెక్టర్ ప్రశంసాపత్రాల ద్వారా గుర్తించారు.
యూఎస్టీ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద 600 డిజాస్టర్ ఫ్లడ్ రిలీఫ్ కిట్లను వరద ప్రభావిత కుటుంబాలకు పంపిణీ చేసిందని, తద్వారా అత్యవసర సమయంలో వారికి ఉపశమనం లభించిందని కలెక్టర్ తెలిపారు. సమాజ సేవ పట్ల సంస్థకు ఉన్న నిబద్ధతను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.
కార్యక్రమంలో యూఎస్టీ సీఎస్ఆర్ అంబాసడర్ తిరుమల విజయ్ కుమార్, వాలంటీర్లు రాధికా పెరుమాళ్, షాహుల్ సయ్యద్, సురేంద్రనాథ్ తిరునగరం, బిక్షపతి ఎండ్లా చేసిన సేవలను కలెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. వరద బాధితులకు సమర్థవంతంగా సహాయక కార్యక్రమాలు నిర్వహించినందుకు వారికి అభినందనలు తెలిపారు.
అనంతరం జరిగిన సమావేశంలో విద్య, వైద్యం, డిజిటల్ మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లో భవిష్యత్తులో సీఎస్ఆర్ కార్యక్రమాలను విస్తరించే అవకాశాలపై చర్చించారు. జిల్లా అభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాల్లో యూఎస్టీ సంస్థ సహకారాన్ని కొనసాగించాలని కలెక్టర్ కోరారు.
సమాజాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి దోహదపడే కార్యక్రమాల్లో జిల్లా పరిపాలనతో కలిసి భవిష్యత్తులో మరింత విస్తృతంగా పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.








