కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారణకు ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్‌పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది.
బ్యారేజీల్లో అవకతవకలపై విచారణ కోసం జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్‌ను నియమిస్తూ మార్చి 14న జారీ చేసిన జీవో 6ను సవాలు చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సభర్వాల్, ఎస్.కె.జోషిలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది.
మార్చి 12న తీర్పును రిజర్వు చేసిన ధర్మాసనం, మొదట ఈ నెల 8న తీర్పు వెలువడుతుందని ప్రకటించినప్పటికీ, తీర్పు సిద్ధం కాకపోవడంతో దానిని ఈ నెల 22కు వాయిదా వేసింది. పిటిషనర్లు తమ వాదనల్లో, జస్టిస్ ఘోష్ కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలో ఉల్లంఘనలు జరిగాయని, అభియోగాలు మోపే ముందు తమ వాదనను పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా కమిషన్‌ను ఏర్పాటు చేసినా, మరొకరి పరువు ప్రతిష్ఠలను దెబ్బతీయడం సరికాదని తెలిపారు.
ప్రభుత్వం తరఫు న్యాయవాదులు మాత్రం, ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని కమిషన్‌ను నియమించినట్లు వాదించారు. ఈ నేపథ్యంలో, హైకోర్టు నేడు వెలువరించే తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.










