మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న బాలసదనం పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం పరిశీలించి, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 1.34 కోట్ల రూపాయల మిషన్ వాత్సల్య నిధులతో చేపట్టిన బాలసదనం నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. పనులు ఆశించిన స్థాయిలో లేవని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
త్వరితగతిన పనులు పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని కలెక్టర్ సూచించారు. బాలల సంక్షేమానికి ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకమని ఆయన తెలిపారు.
అధికారులు సమన్వయంతో పనిచేసి, నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిరోజూ పనుల పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు.











